చాతుర్మాస్య దీక్ష సులభంగా పాటించే విధానం – పూర్తి వివరాలు!

శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర కాలం చాతుర్మాస్యం. ఈ నాలుగు నెలల కాలాన్ని ఆధ్యాత్మికంగా మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి/ శయన ఏకాదశి) నుండి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) వరకు ఉండే ఈ సమయం, కేవలం పూజలు, వ్రతాలకు మాత్రమే పరిమితం కాదు, మనసును శుద్ధి చేసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది అనువైన సమయం. ఈ పవిత్ర కాలంలో చాతుర్మాస్యాన్ని ఎలా ఆచరించాలో ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.
చాతుర్మాస్యం ప్రాముఖ్యత
“విశ్వం విష్ణుః” అన్నట్లుగా, సమస్త విశ్వంలో నిండి ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ కాలంలో తనలో తాను లీనమై ఉంటాడని ప్రతీతి. ఇది బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖంగా మారడానికి, మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి ఒక గొప్ప అవకాశం. ఈ వ్రతం పాటించడం ద్వారా ధర్మార్థకామాలతో పాటు వైకుంఠ ప్రాప్తి మరియు మోక్షం కూడా లభిస్తాయని గ్రంథాలు పేర్కొన్నాయి
చాతుర్మాస్య దీక్ష ప్రాముఖ్యత పాటించే విధానాలు (మీ వీలును బట్టి)
చాతుర్మాస్య దీక్ష ను ఆచరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ సౌలభ్యాన్ని బట్టి వీటిలో ఏదైనా ఒక పద్ధతిని ఎంచుకోవచ్చు:
- సంపూర్ణ చాతుర్మాస్యం: నాలుగు నెలలు పూర్తి కాలం వ్రతాన్ని పాటించడం. అనగా ఆషాఢ తొలి ఏకాదశి నుండి కార్తీక ఉత్థాన ఏకాదశి వరకు చేయవలెను.
- అర్థ చాతుర్మాస్యం: రెండు నెలలు వ్రతాన్ని పాటించడం.
- పాద చాతుర్మాస్యం: ఒక నెల, ముఖ్యంగా కార్తీక మాసంలో వ్రతాన్ని పాటించడం.
- నవ దినాలు (తొమ్మిది రోజులు ): ఈ నాలుగు నెలల్లో వచ్చే ఐదు శుక్ల పక్ష ఏకాదశులు మరియు నాలుగు కృష్ణ పక్ష ఏకాదశులు – మొత్తం తొమ్మిది రోజులు వ్రతాన్ని పాటించడం. అనగా తొలి తొలి ఏకాదశి / శయన ఏకాదశి, కామికా ఏకాదశి, శ్రావణ పుత్రదా ఏకాదశి, అజా ఏకాదశి, పరివర్తినీ ఏకాదశి / పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాపన్కుశ ఏకాదశి, రమా ఏకాదశి, ప్రబోధినీ ఏకాదశి / ఉత్థాన ఏకాదశిఈ తొమిది ఏకాదశిలు చేయవచ్చు.
- పంచ దినాలు (ఐదు రోజులు ): కేవలం ఐదు శుక్ల పక్ష ఏకాదశులలో మాత్రమే వ్రతాన్ని పాటించడం. అనగా తొలి ఏకాదశి / శయన ఏకాదశి, శ్రావణ పుత్రదా ఏకాదశి, పరివర్తినీ ఏకాదశి / పార్శ్వ ఏకాదశి, పాపన్కుశ ఏకాదశి, ప్రబోధినీ ఏకాదశి / ఉత్థాన ఏకాదశి ఈ ఐదు ఏకాదశిలు చేసినా సరిపోతుంది.
చాతుర్మాస్య వ్రతంలో చేయవలసినవి (ఆరు ముఖ్య నియమాలు)
ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఆరు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి:
- ప్రాతః కాల స్నానం: ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయడం.
- శ్రీ మహావిష్ణువు పూజ: నిత్యం శ్రీ మహావిష్ణువును పూజించడం. వీలైతే విష్ణు సహస్రనామం వినడం లేదా పఠించడం మంచిది.
- ఇష్టాలను త్యజించడం: మీకు ఇష్టమైన కొన్ని వస్తువులు లేదా అలవాట్లను ఈ వ్రత సమయంలో వదులుకోవడం. ఇది మనసును నియంత్రించడంలో సహాయపడుతుంది.
- మౌన వ్రతం: అనవసరమైన సంభాషణలను తగ్గించడం. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి, సానుకూలంగా మాట్లాడండి. “వ్రతంలో మన వాక్కుకు శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతికూలంగా మాట్లాడకూడదు.”
- ఏకాదశి ఉపవాసం: చాతుర్మాస్యంలో వచ్చే ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండటం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయనవసరం లేదు.
- సేవ: గోవులకు మరియు దేవాలయాలకు సేవ చేయడం. దేవాలయ సేవ అశ్వమేధ యాగంతో సమానం అని పురాణాలు చెబుతున్నాయి.
చాతుర్మాస్య వ్రతంలో చేయకూడనివి (ఆరు ముఖ్య నియమాలు)
వ్రతం చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించకూడదు:
- మద్యం మరియు మాంసాహారం: వీటిని పూర్తిగా త్యజించాలి.వీలైతే ఏకభుక్తం (రోజుకు ఒకసారి భోజనం) పాటించడం మంచిది. భోజనం సాత్వికంగా ఉండాలి మరియు విష్ణువుకు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి.
- వివిధ మాసాలలో కొన్ని పదార్థాల నివారణ: నాలుగు నెలలు వ్రతం చేసేవారు మొదటి నెలలో ఆకుకూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ నెలలో ద్వಿದళాలు (పప్పు ధాన్యాలు) స్వీకరించకూడదు. “ఏ నెలలో ఏది వదలాలి అనేది భవిష్య పురాణంలో స్పష్టంగా చెప్పబడింది.”
- నింద, హింస, ద్వేషం, అసూయ: ఇతరులను నిందించడం, హింస, ద్వేషం, అసూయ మరియు ఈర్ష్య వంటి వాటికి దూరంగా ఉండాలి.
- గ్రామాంతర ప్రయాణాలు: వినోద ప్రయాణాల కోసం ఇతర గ్రామాలు లేదా నగరాలకు వెళ్లడం నివారించాలి. అత్యవసర పరిస్థితులలో ప్రయాణం చేయవచ్చు.
- భూశయనం: మంచం లేదా పరుపులపై కాకుండా నేలపై లేదా చాపపై పడుకోవడం.
- దాంపత్య సుఖాలు: ఇంద్రియ సుఖాలను నివారించడం, తద్వారా మనస్సు దైవం పైనే నిలిచి ఉంటుంది.
చాతుర్మాస్యం వెనుక గల అంతరార్థం
శ్రీ మహావిష్ణువు యోగనిద్ర వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, ఖగోళ మరియు ప్రాపంచిక కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో సూర్యుడు మేఘాల వెనుక దాగి ఉండటం విష్ణువు యోగనిద్రకు ప్రతీక. వర్షాకాలంలో ప్రయాణ కష్టాలను నివారించడానికి ప్రయాణాలు మానుకోవడం ఒక ఆచరణాత్మక నిర్ణయం.
అలాగే, కొన్ని ఆహార పదార్థాలను నివారించడం ఆయుర్వేదం మరియు ఆరోగ్య సూత్రాలపై ఆధారపడి ఉంది. వర్షాకాలంలో కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. సనాతన ధర్మం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్ర విజ్ఞానంతో సమన్వయం చేసే ఒక అద్భుతమైన జీవన విధానం.
ముగింపు:
చాతుర్మాస్య వ్రతం అనేది మన అంతరంగ ప్రయాణానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక గొప్ప అవకాశం. పైన సూచించిన పద్ధతులలో మీకు సాధ్యమైన దానిని ఎంచుకుని, చేయవలసినవి చేస్తూ, చేయకూడనివి వదిలివేస్తే ఈ వ్రతం విజయవంతంగా పాటించినట్లే. ఈ వ్రతం వెనుక ఉన్న లోతైన అర్థాలను అర్థం చేసుకుని, శ్రద్ధగా ఆచరిస్తే, మీరు తప్పకుండా ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంతో ఉన్నతిని పొందుతారు.
ఈ చాతుర్మాస్యం మీ జీవితంలో శాంతిని, శ్రేయస్సును తీసుకురావాలని ఆశిస్తున్నాము. ఈ వ్రతం గురించి మీ అభిప్రాయాలు, అనుభవాలు మాతో పంచుకోండి!
తొలి ఏకాదశి / శయన ఏకాదశి ప్రాముఖ్యత గురించి చాగంటి గారు చెప్పిన ఈ ఆధ్యాత్మిక ప్రవచనమును వినండి.