Home » శ్రీముఖలింగం ఆలయ చరిత్ర మరియు విశేషాలు
శ్రీముఖలింగం

ఆ పరమేశ్వరుడే ఎన్నో వేలసంవత్సరాల క్రితం స్వయంభువుగా ముఖలింగ ఆకారంతో వెలసిన ఏకైక క్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రాన్ని దక్షణ కాశీ అనికూడా అంటారు.

వంశధార నదీతీరాన పచ్చని ప్రకృతి నడుమ శోభిస్తున్న ఆ పరమేశ్వరుడిని ఇక్కడ శ్రీముఖలింగేశ్వరునిగా భక్తులు పూజిస్తారు.

కాశ్యన్తు మరణం ముక్తిహి, శ్రీశైల శిఖరం |
ముఖలింగ ముఖం దృష్ట్వ, పునర్జన్మ నవిద్యతే ||

అంటే కాశీలో మరణించిన, శ్రీశైలంలో శిఖర దర్శనం చేసిన, శ్రీముఖలింగేశ్వర స్వామి వారి ముఖముని దర్శనం చేసిన పునర్జన్మ ఉండదు అని మహర్షులు సైతం సేవించిన శ్రీముఖలింగేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర, ఆలయ విశేషాలతో పాటు, ఆలయానికి ఎలా వెళ్ళాలి అక్కడి వసతి సదుపాయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

శ్రీ ముఖలింగేశ్వర ఆలయ చరిత్ర

ద్వాపర యుగంలో వామదేవ మహాఋషి వంశధార నది వడ్డున ఒక యాగము చేయాలి అని భావించి, ఆ యాగమునకు దేవతలతో పాటుగా యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులతో సహా అందరినీ ఆహ్వానం చేస్తారు.

గంధర్వులు మార్గం మధ్యలో కిరాతకులు అనే స్త్రీల సౌందర్యానికి మోహపరవసులై యాగాన్ని మరచి వారితో పాటుగా అరణ్యం లోనే ఉండిపోతారు.

యాగం పూర్తి అయిన తరువాత వామదేవ మహాఋషి గంధర్వులు రాలేదు అని గ్రహించి తన దివ్య దృష్టితో చూసి గంధర్వులు కిరాతకులు అనే స్త్రీల తో ఉండిపోయారు అని గ్రహించి, గంధర్వులను కూడా కిరాతకులుగా మారి భూమి మీద అరణ్యం లోనే ఉండిపోవుదురు గాక అని శపిస్తారు.

ఈ విషయాన్ని నారదుని ద్వారా తెలుసుకున్న గంధర్వులు వారు చేసిన తప్పుని గ్రహించి, ఈ శాపం నుండి విముక్తి కలిగే మార్గాన్ని కల్పించమని వేడుకోసాగారు.

దానికి వామదేవ మహాఋషి ద్వాపర యుగాంతంలో వంశధార నది ఒడ్డున మధువృక్షంలో పరమశివుడు ముఖముతో మధుకేశ్వరుడిగా (ముఖలింగేశ్వరుడిగా) దర్శనమిస్తారని, అప్పుడు శాపవిమోచనం కలుగుతుందని వామదేవ మహాఋషి అంటారు.

శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆవిర్భావం

వామదేవ మహర్షి శాపం వలన గంధర్వులు కిరతకులుగా అరణ్యంలో జన్మిస్తారు.

అరణ్యం లోని కిరతకులు కు రాజు చిత్రసేనుడు రాజుగారి భార్య పేరు చిత్తి. అరణ్యం లో మధువృక్షాలు చాల ఎక్కువగా ఉండేవి.

అయితే ఒక పెద్ద పుట్ట పైన మాత్రం మధువృక్షం రెండు కొమ్మలతో బలంగా పెరిగి అన్ని ఋతువులలో పూలు పూసేది.

ఈ వృక్షాన్ని చిత్రసేనుడు భార్య అయిన చిత్తికి అప్పచెపుతాడు. మధువృక్షం నుండి వచ్చిన పూలను సంతలో ఇచ్చి వచ్చిన నూకలు ఇతర సరుకులతో వారు జీవనం సాగించేవారు.

ఇలా కొన్నాళ్ళ తరువాత చిత్కళి అనే పేరుగల ఒక జంగమ స్త్రీ శ్రీ శైలం నుండి కాశీ కి వెళ్తూ దారి తప్పి అరణ్యం లోనికి ప్రవేశిస్తుంది.

చిత్కళి బహు సౌందర్య రాశి రాజు ఆమె సౌందర్యానికి వశుడై మొదటి భార్య అనుమతితో చిత్కళిని వివాహం చేసుకుంటాడు.

మధువృక్షం యొక్క రెండు కొమ్మలలో నచ్చినది మొదటి భార్యకు మిగిలిన కొమ్మ రెండవ భార్యకు ఇస్తాడు.

రెండవ భార్య చిత్కళి శివభక్తురాలు, చిత్కళి మధువృక్షం క్రింద ఉన్న పుట్టను శివలింగంగా భావించి రోజు అత్యంత భక్తి తో పూజలు చేసేది.

పరమేశ్వరుడు చిత్కళి భక్తికి మెచ్చి ఆమెకి ఇచ్చిన చెట్టు కొమ్మకు బంగారు పుష్పాలు పూయించేవాడు.

మొదటి భార్య చిత్తికి ఇచ్చిన చెట్టు కొమ్మకు సాదారణ విప్ప పూలు పూసేవి. రాజుకి దానితో వచ్చిన నూకలు, గంజి అన్నం పెడుతూ వుండేది.

రెండవ భార్యకు బంగారు పూలు దొరకటం వలన పంచభక్ష్య పరమన్నాలు పెట్టేది. ఈ విషయం తెలిసిన మొదటి భార్య చిత్కళి తో గొడవ పెట్టుకోవడంతో రాజుగారు చెట్టు కొమ్మలును ఇద్దరికి మార్చి ఇస్తాడు.

అయిన సరే చిత్కళి శివభక్తురాలు కావటంవల్ల ఆమెకి చెందిన చెట్టు కొమ్మకి బంగారు పూలు పూసేవి. మరల గొడవలు రావటం వల్ల రాజు ఈ మయా చెట్టు వలనే ఈ గొడవలు వస్తున్నాయి అని భావించి ఆగ్రహంతో చెట్టును నరికేస్తాడు.
చెట్టు నరికిన తరువాత పుట్టలోనుండి వచ్చిన అగ్ని జ్వాల వలన రాజు స్పృహ కోల్పోయి పడిపోతాడు.

మొదటి భార్య చిత్తి రాజు పడిపోవడానికి ఈ మాయావి చిత్కళి అని భావించి చంపేయమని గట్టిగా అరుస్తుంది.

చిత్కళి చంపడానికి కిరతకులు అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. చిత్కళి మాత్రం భక్తి తో పరమేశ్వరున్ని వేడుకుంటుంది.

పరమేశ్వరుడు ముఖారూపం దాల్చి ముఖలింగేశ్వరునిగా దర్శనమిస్తారు. దీనితో శాపవిమోచనం పొంది కిరతకులు మరలా గంధర్వులు రూపాన్ని పొందుతారు.

రాజు చిత్కళి శివ సన్నిది ని పొందుతారు. దేవతలు అందరూ వచ్చి ముఖలింగేశ్వరున్ని దర్శనం చేసుకొన్న తరువాత కోటికి ఒక్కటి తక్కువ శివలింగాలు ప్రతిష్ట చేశారు అని పూరణాల ద్వారా తెలుస్తుంది.

అందుకే ఇది దక్షిణ కాశీ గా అక్కడి జనం నమ్ముతారు.

శ్రీముఖలింగం ఆలయ విశేషాలు

శ్రీముఖలింగేశ్వర స్వామి వారి ఆలయం ఎన్నో విశేషాలతో నిండివున్నది. ఇండో ఆర్యన్ పద్దతిలో కట్టబడిన శ్రీముఖలింగేశ్వర ఆలయం కళింగ రాజుల అద్భుత శిల్ప కళానైపుణ్యానికి తార్కాణం. ఆలయం పైన చెక్కబడిన ప్రతీ శిల్పము మనకు ఎన్నో పురాణ కథల గురించి వివరిస్తునట్టుగా ఉంటుంది.

ఈ ఆలయంలో ప్రవేశించగానే కుడివైపున ఈశ్వర ముఖముతో వున్నా శివలింగాన్ని చూడవచ్చు, దీనిని కుభేరుడు ప్రతిష్టించారు. గర్భాలయం మూసేసిన తరువాత ఎవరైన భక్తులు వస్తే వారికి స్వామివారి దర్శనం అవలేదు అని బాధపడకుండా ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. ఈ ముఖముతో వున్నా కుబేర ప్రతిష్ట అయిన శివలింగాన్ని దర్శనం చేస్తే లోపల వున్నా శ్రీముఖలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసినట్లే అని చెబుతారు.

ఆలయం లోని నలువైపులా మనకు దిక్పాలకులచే ప్రతిష్ఠింపబడిన శివలింగాలు దర్శనమిస్తాయి. దేవేంద్రుడు, వరుణుడు, అగ్ని, యమధర్మరాజు, కుభేరుడు, నైరుతి మరియు వాయు దేవులచే ప్రతిష్ఠింపబడిన శివలింగాలు ఇక్కడ మనకు కనబడతాయి.

ఈ ఆలయంలో మనం విగ్నేశ్వరుని వివిధ రూపాలలో చూడవచ్చు. ఒక చోట సాక్షి గణపతిగా మరి ఒక చోట ఒకే పీఠము పైన ఇద్దరు దుండి విగ్నేశ్వరులుగా చూడవచ్చు. ఒక మూర్తి పంచాయతన మూర్తులలో ఒక్కరిగా దర్శనము ఇస్తే, మరిఒక మూర్తి దుండి విగ్నేశ్వరునిగా పూజలందుకుంటారు.

ప్రధాన ఆలయం వెనుక సుభ్రమణ్యస్వామి వారు కొలువై వున్నారు. ఈ స్వామిని కుళోతంగ చోళ మహారాజు, కళింగుల మీద దండెత్తడానికి వచ్చినప్పుడు ప్రతిష్టించారని చరిత్రకారులు చెబుతారు.

శివకేశవులు ఇద్దరు ఒక్కటే అని చెప్పే విధంగా మనకు స్వామివారు ఇక్కడ హరిహర మూర్తిగా దర్శనం. ఒకవైపు పరమేశ్వరుడు మరిఒకవైపు శ్రీమహావిష్ణువును ఈ మూర్తిలో గమనించవచ్చు.

ఈ ఆలయం ఉత్తర ముఖాన మనకు ఆ పార్వతీ దేవి వారాహి అమ్మవారిగా దర్శనమిస్తుంది. స్వామి వారిని ఇక్కడి భక్తులు వారాహి సహిత ముఖలింగేశ్వర స్వామిగా పూజిస్తారు. ఇక్కడ వారాహి అమ్మవారు ఎంతో తేజస్సుతో నిండివుండి భక్తులను అనుగ్రహిస్తుంది.

ప్రధాన ఆలయం లో మరి ఒక విశేషం ఏమిటంటే ఒక్కే చోటునుండి కేవలం ముఖము తిప్పిన్నంత మాత్రం చేత మనకు పంచాయతన మూర్తులయిన సూర్యుడు, గణపతి, శ్రీమహావిష్ణువు, వారాహి మరియు పరమేశ్వరుల దర్శనం అవుతుంది.

ఈ క్షేత్రానికి తూర్పు దిక్కున రత్నగిరి పైన వెలసిన పద్మనాభ స్వామి వారు క్షేత్రపాలకునిగా వున్నారు..

ఆలయంలో మట్టి గోళం ఎలా వచ్చింది

మనకు గర్భాలయంలో ముఖలింగేశ్వరుని వెనుక ఒక్క మట్టి గోళం చూడవచ్చు. దీని గురించి ఎక్కడ ఒక్క స్థల పురాణం వున్నది.

పూర్వం ఓక కుమ్మరి భక్తుడు తనకు పిల్లలు కలిగితే ఒక మట్టి గోళం సమర్పిస్తానని స్వామివారిని మొక్కుకున్నాడు. తనకి పిల్లవాడు పుట్టిన తరువాత, అతను మొక్కుకున్నటు ఒక మట్టి గోళం చేసి తీసుకొచ్చాడు కానీ అది గర్భాలయ ద్వారం కన్నా ఎంతో పెద్దది.

దానిని ఆలయం లో తీసుకెళ్లి స్వామికి సమర్పించలేక ఆ మట్టి గోళం అక్కడే వదిలి బాధ పది వెళిపోయాడు. ఆ మరుసటి రోజు గర్భాలయం తెరిచి చూడగానే ఆ మట్టి గోళం ముఖలింగేశ్వరుని వెనుక వున్నది. ఇప్పటికీ భక్తులు ఆ గోళం దగ్గరకు వెళ్లి స్వామివారిని వేడుకుంటే వారి కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతారు.

సోమేశ్వర మరియు భీమేశ్వర ఆలయం

శ్రీముఖలింగ క్షేత్రంలో మనకు త్రికోణ ఆకారంలో మూడు ప్రధాన శివాలయాలు వున్నాయి. మొదటిది స్వయంభువుగా వెలసిన శ్రీముఖలింగేశ్వర ఆలయం, రెండోవది చంద్రుడిచ్చే ప్రతిష్ఠింపబడిన సోమేశ్వర ఆలయం. మూడవది భీమునిచ్చే ప్రతిష్ఠింపబడిన భీమేశ్వర ఆలయం.

మనకు ఈ సోమేశ్వర మరియు భీమేశ్వర ఆలయాల లోని శివలింగాల పైన భ్రమ్మ సూత్రాన్ని గమనించ వచ్చు. ఇలా భర్మ సూత్రాలు వున్నా శివాలయాలు చాలా అరుదు. మనము ఒక్కసారి గనుక భ్రమ్మ సూత్రం వున్న శివాలయానికి వెళితే కోటి మార్లు వెళ్లినంత ఫలితం వస్తుంది అని మనకు శివాగమం చెబుతుంది.

ఆంధ్ర మరియు ఒడిస్సా మైత్రికి గుర్తుగా మనకు భీమేశ్వర ఆలయంలో రెండు నందులు కనబడతాయి. పురావస్తుశాఖ వారు ఈ చుట్టుపక్కల మరుగున పడ్డ శివలింగాలను ఈ ఆలయంలో భద్ర పరచడం మనం చూడవచ్చు

ఆలయంలో జరిగే ఉత్సవములు

మాఘ మాసంలో వచ్చే మహా శివరాత్రి రోజున స్వామి వారికి ఇక్కడ వున్న వంశధార నదిలో చక్ర తీర్ధ స్నానం జరుగుతుంది. ఆ రోజు ఇక్కడకి లక్షల సంఖ్యలో వచ్చే భక్తులని మనం చూడవచ్చు.

కార్తీక మాసంలో కార్తీక సోమవారములు, కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం మరియు నంది వాహనం తిరువీధి అంటూ స్వామి వారికి విశేష పూజలు జరుగుతాయి.

జ్యేష్ఠమాసములో వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి 05 రోజులు శ్రీ స్వామి వారి కళ్యాణం ఎంతో ఘనంగా చేస్తారు.

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం మరియు ఆశ్వీయుజ మాసం లో దేవి నవరాత్రులు శ్రీ వారాహి అమ్మవారు దగ్గర 09 రోజులు ఎంతో వైభవంగాజరుగుతాయి.

ఆలయానికి ఎలా వెళ్ళాలి వసతి

శ్రీముఖలింగం క్షేత్రము ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం లో వున్నది. ఇది శ్రీకాకుళం నుండి సుమారుగా 40 kms దూరంలో వంశధార నాదీ తీరాన వున్నది.

ఈ ఆలయం చేరాలి అనుకున్నవాళ్లు ముందుగా శ్రీకాకుళానికి ట్రైన్ లేదా బస్సు ద్వారా రావాలి. శ్రీకాకుళం నుండి మనకు ఈ క్షేత్రానికి అనేక బస్సులు వున్నాయి.

ఇది పల్లెటూరు కాబట్టి మనకి వసతి సదుపాయాలు తక్కువ. అందుచేత మనం శ్రీకాకుళంలో ఉండే ప్రైవేట్ హోటల్స్ లో ఉండి ఇక్కడకు బస్సు లేదా ఆటో ద్వారా రావటం మంచిది.

శ్రీకాకుళంలోనే మనకు శ్రీమహా విష్ణువు యొక్క రెండొవ అవతారమైన శ్రీకూర్మం పుణ్య క్షేత్రము కూడా వున్నది. శ్రీకూర్మం క్షేత్రము వివరాలకు ఈ పేజీ లోకి వెళ్ళగలరు.


1 thought on “శ్రీముఖలింగం ఆలయ చరిత్ర మరియు విశేషాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page