Home » శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం
sri maddi anjaneya swamy temple

హనుమ యొక్క విగ్రహం లేని ఊరు ఉండదు. మనకు చిన్న కష్టం వచ్చినా హనుమ యొక్క గుడికి వెళ్ళి, హనుమాన్ ప్రదక్షిణ మంత్రం చదువుకుంటూ 3, 5, 7, 9, 16, 21 మరియు 108  సార్లు ప్రదక్షిణాలు చేస్తే చాలు.  ఎటువంటి పనైనా సులభంగా అవుతుందిలే అని కొండత ధైర్యం వస్తుంది.  

హనుమ ఒక భక్తుని కోసం మద్ది చెట్టు తొర్రలో స్వయంభుగా వెలసిన  పుణ్యక్షేత్రం, శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, గురవాయి గూడెంలో ఉన్న ఈ ఆలయం గురించి తెలుసుకుందాం.

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయ చరిత్ర

రావణాసురుడు సైన్యం లో మధ్యుడు అనే రాక్షసుడు ఉండేవాడు.  హనుమ సీతాన్వేషణ కొరకు లంకకు వెళ్ళినప్పుడు, ఈ మధ్యుడు స్వామి హనుమకు భక్తుడు కావడం జరుగుతుంది. మధ్యుడు రావణ సైన్యమునకు చెందిన వాడు కావడం చేత, స్వామి హనుమకు ప్రత్యక్షంగా పూజలు దర్శనం చేయలేకపోయేవాడు.  కానీ ఎప్పుడూ హనుమనే తలచుకుంటూ రామ-రావణ యుద్ధ సమయం లో మధ్యుడు వానర సైన్యము చేతిలో చనిపోతాడు.  

ద్వాపర యుగంలో మద్వాకుడు గా జన్మిస్తాడు.  అయితే  ఈ సారి కౌరవుల వైపు ఉంటాడు.  పాండవులు మరియు కౌరవుల యుద్దంలో అర్జునుడి రధం యొక్క జెండా పైన ఉన్న హనుమను చూసి, తన పూర్వ జన్మలో హనుమ భక్తుడిగా ఉన్నట్లు జ్ఞాపకం వచ్చి యుద్ధ భూమిని విడిచి తక్షణమే శరీరాన్ని వదిలి పెడతాడు. 

ఈ కలియుగంలో మధ్యుడు గా పుడతాడు.  నిత్యం ఎర్ర కాలువలో స్నానం చేసి కాలువ ఒడ్డునే హనుమ యొక్క దర్శనం కొరకు హనుమ జపం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.  వయసు మీద పడి శరీరం సహకరించని సమయంలో రోజు లాగే ఎర్ర కాలువలో స్నానం చేస్తూ కాలువలో పడిపోతే, ఎక్కడి నుంచో ఒక వానరం వచ్చి మధ్యుడు ని వడ్డుకి తీసుకొని వచ్చి కాపాడుతుంది.  

ఆ రోజు నుండి ఆ వానరం ఆయనకు సేవ చేస్తూ ఉంటుంది.  అలాగే తినడానికి పండ్లను కూడా ఇస్తుంది. ఇలా కొన్నాళ్ళకు మధ్యుడు వానర రూపంలో ఉన్నది ఆంజనేయ స్వామి అని గ్రహించి, దర్శన భాగ్యం ఇమ్మని వేడుకొంటాడు.  వెంటనే స్వామి నిజరూపాన్ని పొంది మధ్యుడుని అనుగ్రహిస్తాడు.

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆవిర్భావం:

మధ్యుడు స్వామి వారిని ఎప్పుడూ తనతో ఉండమని కోరుకొంటాడు.  అప్పుడు స్వామి మధ్యుడు ని తెల్ల మద్ది చెట్టు రూపంలో ఉండమని, స్వామి వారు చెట్టు మొదట్లో ఉంటానని చెబుతాడు.  అలా స్వామి ఒక చేతిలో పండు మరో చేతిలో గధతో స్వయంభువుగా వెలుస్తారు. 

కొన్ని వందల సంవత్సరాల తరువాత ఓ భక్తురాలి కలలో స్వామి కనిపించి తను మద్ది చెట్టు తొర్రలో ఉన్నానని చెప్పడం వలన ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి చూస్తే మద్ది చెట్టు తొర్రలో స్వామి హనుమ విగ్రహం కనిపిస్తుంది.  

అలా ఆ ఊరి వారందరికీ 1166 వ సంవత్సరం లో మొదటి సరిగా స్వామి వారి దర్శనం కలుగుతుంది. మద్ది చెట్టునే గుడి గోపురంగా ఉంచి గర్భాలయాన్ని ఏర్పాటు చేశారు.

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు:

స్వామి హనుమ తన భక్తుడైన మధ్యుడి కోరికమేరకు, తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువుగా వెలసిన క్షేత్రం ఇది. 

ఇక్కడి గర్భాలయానికి గోపురం ఉండదు.  మద్దిచెట్టే ఈ ఆలయానికి గోపురంగా ఉంటుంది. 

వేలాది భక్తులు ఇక్కడ ఆంజనేయ స్వామి మాల వేసుకొని వారి వారి వీలును బట్టి 11, 21 మరియు 41 రోజుల తరువాత స్వామి వారి ఆలయంలో మాలా విసర్జన చేస్తారు.  

నవగ్రహ దోషాలతో భాద పడేవారు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనం చేత తొలగిపోతాయి అని ఇక్కడి భక్తుల నమ్మకం. 

ఈ దేవాలయం లో మరొక విశేషం ఏమిటంటే వివాహం కాని ఆడపిల్లలు 07 మంగళ వారములు హనుమ చుట్టూ 27 లేదా 108 సార్లు ప్రదక్షణం చేస్తే వివాహం జరుగుతుంది అని విశ్వాసం. 

భక్తులు ఈ ఆలయం లో తల నీలాలు సమర్పించుకోవటం మరో విశేషం.

ఈ ఆలయానికి పక్కనే శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తారు. భక్తులకి ఈ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. 

ఆలయంలో జరిగే ఉత్సవములు:

ఇక్కడ శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి, కార్తీక మాసంలో వచ్చే అన్ని మంగళవారములు లక్ష తమలపాకులతో పూజ, ప్రతీ నెలలో వచ్చే స్వామి వారి జన్మ నక్షత్రం అయిన పూర్వా భాద్ర నక్షత్రం రోజున సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం, ప్రతీ శనివారం స్వామి వారికి  అభిషేకం ఎంతో వైభవం గా జరుపుతారు.  

ఆలయానికి ఎలా వెళ్ళాలి మరియు వసతి:

ఈ క్షేత్రం ఏలూరు నుండి 50 K.M లు మరియు ద్వారకా తిరుమల నుండి 20 K.M లు ఉంటుంది.  కాబట్టి దూర ప్రాంతాలు నుండి వచ్చిన వారైతే ఏలూరులో బస చేసి ద్వారకా తిరుమల మరియు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి గుడికి బస్ లేదా కారు లో వెళ్ళవచ్చు. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page