Home » ఉగాది పండుగ
ugadi panduga

ఉగాది పండుగ నే యుగాది అని కూడా అంటారు. అంటే యుగము ఆరంభమైన రోజు అని అర్థం. కలియుగం ఈ రోజే ప్రారంభం అయినటువంటి కారణం చేత ఉగాది లేక యుగాది అన్న పేరు వచ్చాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాదు ఉగ అంటే నక్షత్ర గమనము, ఆది అనగా ప్రారంభము. ఉగాదికే నక్షత్ర గమనం ప్రారంభమైన రోజు అని కూడా అర్థం.

చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది పండుగ తెలుగు సంవత్సరంలోని మొదటి పండుగ. ఈరోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఉగాది 2023

స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి బుధవారం అనగా తేది : 22.03.2023 న ఉదయం గం. 6.15 ని.లు నుండి గం. 11.15 ని.లు వరకు నూతన పంచాంగ శ్రవణం, ఇష్ట దైవ దర్శనం, పండితులు ఆశీస్సులు పొందుటకు, నూతన వస్త్రాలు ధరించుట, కొత్త పుస్తకాలు ప్రారంభమునకు పూజ కార్యక్రమాలు చేసుకొనుటకు శుభ ప్రదంగా ఉన్నది.

ఉగాది పండుగ ను ఎలా జరుపుకోవాలి?

ఉగాది రోజున మనం నిర్వర్తించవలసిన కార్య క్రమాలు కూడా పెద్దలు నిర్ణయం చేసి ఉంచారు!

ఈ రోజున తెల్లవారుజామునే, అనగా సూర్యోదయానికి 88 నిమిషాలు కంటే ముందుగానే నిద్ర లేవాలి.

తైలభ్యంగ స్నానం ఆచరించాలి. అనగా ఒంటికి నువ్వుల నూనెను రాసుకొని, తలస్నానం చేసుకోవాలి. కొత్త బట్టలను కట్టుకోవాలి.

భగవంతునికి ప్రసాదమును నివేదన చేసుకొని పూజ చేయాలి. ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదించి, ప్రసాదంగా తీసుకోవాలి. ఈరోజు ఉగాది పచ్చడిని తిన్న తరువాతే, ఇంకే పదార్థమైనా తినాలి.

ఈ రోజున పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి.

ఉగాది పచ్చడిని ఎలా చేయాలని శాస్త్రం చెబుతోంది?

ఉగాది పచ్చడిని ఎలా చేయాలోకూడా మన శాస్త్రం చెబుతోంది.

యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘ్రుతైర్యుతం|
భక్షితమ్ పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం||

సూర్యోదయానికి ముందే వేపపువ్వు, చింతపండు, బెల్లం, ఆవు నెయ్యి, మామిడికాయ ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిగా చేయాలి. దీనిని భగవంతుడికి నివేదన చేసి, సూర్యోదయానికి ముందే ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఎవరు చేస్తారో వారు ఆ సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతారు.

ఉగాది పచ్చడిలో ప్రధానంగా ఉండవలసిన పదార్థములు ఏమిటంటే

  • నింబసుమం – వేపపువ్వు
  • శర్క – పంచదార లేదా బెల్లం
  • ఆమ్లీక – చింత పండు
  • ఘ్రుతైర్యుతం – అవునెయ్యి

చైత్ర మాసంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మామిడి ముక్కలు కూడా ఉగాది పచ్చడి లో కలుపుతారు.

దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్ధేశ్యం భగవంతుని దయతో
మంచి ఆరోగ్యాన్ని పొందాలని, అందుకే వేప పువ్వుని ప్రసాదంతో కలిపి తినిపిస్తారు.

ఈ క్రింది శ్లోకం ఉగాది పచ్చడి సేవించే ముందు చదువుకుని స్వీకరించగలరు.

శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ.
సర్వారిష్ట వినాశాయ నింబకదళ భక్షణమ్!

పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి అని శాస్త్రం చెబుతుందో మీకు తెలుసా?.


2 thoughts on “ఉగాది పండుగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page